కొనుగోలు కేంద్రాల్లో రైతుల మృ*తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..

0
132

బలగం టీవీ, సిద్దిపేట:

మాజీ మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతుల మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో నలుగురు రైతులు కొనుగోలు కేంద్రాల్లో మరణించారని ఆయన గుర్తు చేశారు.

సాగునీరు అందించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, కాంటాలు పెట్టడంలో, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో మరియు బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు దుయ్యబట్టారు. రైతులు చనిపోతుంటే రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మామిడి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, పత్తి రైతులకు రూ. 3500 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టం చెల్లించాలని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, కొన్న పంట డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెండింగ్ లో ఉన్న రూ. 500 కోట్ల పంట బోనస్ ను తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించామని, పంట కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here