కన్నెగంటి రవి,
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(TPJAC )
ఫోన్: 9912928422
తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ పాలనకు జనవరి 6 నాటికి నెల రోజులు నిండాయి. ఈ నెల రోజుల పాలనలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు చిహ్నంగా ఉన్న ముళ్ళ కంచెలు తొలిగాయి. ప్రగతి భవన్ ప్రజావాణి లో ప్రజలు తమ గొంతు వినిపిస్తున్నారు. మహాలక్షి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గత పాలనకు భిన్నంగా ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు అందాయి.
5 గ్యారంటీలపై ప్రజల నుండీ దరఖాస్తులు స్వీకరించడానికి “ప్రజా పాలన” పేరుతో అధికారులు ప్రజల ముంగిట్లోకి వచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ రంగాలపై ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ప్రజల ముందు శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ఆయా అంశాలపై ప్రజలకు కొంత అవగాహన ఏర్పడడానికి , గత ప్రభుత్వ పాలనా వైఫ్యల్యాలను అర్థం చేసుకోవడానికి ఈ పత్రాలు తోడ్పడ్డాయి. ఇవన్నీ తప్పకుండా ప్రజలకు ఊరట నిచ్చే అంశాలే.
వీటితో పాటు, ముఖ్యమంత్రి కి ఉండే బిజీ షెడ్యూల్ రీత్యా, ఇతర రంగాల లాగే, విద్యా శాఖకు కూడా ప్రత్యేక మంత్రిని నియమిస్తే ఆ రంగానికి సంబంధించి చర్చలు, పనులు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది. మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా, వ్యవసాయ రంగానికి చట్టబద్ధ అధికారాలతో కమీషన్ ను నియమిస్తే, ఆ రంగానికి సంబంధించి కూడా చర్చలు, కార్యాచరణ మొదలయ్యేవి.
అత్యంత అవినీతికి , తప్పుడు నిర్ణయాలకు కేంద్రంగా ఉండిన నీటి పారుదల రంగంపై ఇంకా శ్వేత పత్రం వెలువడాల్సి ఉంది. ఆ పత్రం కూడా అనేక కొత్త విషయాలను బయట పెట్టే అవకాశం ఉంది. ఈ శ్వేత పత్రాన్ని కూడా వెంటనే వెలువరించడం తో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై, అవినీతిపై వేగంగా న్యాయ విచారణ పూర్తి చేయించాలి. తప్పులకు బాధ్యుల నుండీ నష్ట పరిహారం రాబట్టాలి. తప్పుకు తగిన శిక్ష పడే వరకూ విచారణ కొనసాగించాలి.
గత రెండు మూడేళ్లుగా, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన రైతులకు నష్ట పరిహారం అందించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్దం కావాలి. ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ వల్ల నష్ట పోయిన రైతులకు అవకాశం ఉన్న ఛోట వారి భూములు వారికి తిరిగి వెనక్కు ఇచ్చేయాలి. ముఖ్యంగా అందరూ వ్యతిరేకిస్తున్నా, 50 టీఎంసీల సామర్ధ్యంతో కట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధిలో ఈ విషయం పరిశీలించాలి.
గ్రామాలను,రైతుల పొలాలను ముంచి కట్టిన ఈ ప్రాజెక్టు పరిధిలో బహుళ జాతి కోకో కోలా కంపనీ ఏర్పాటుకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్ధు చేయాలి. దశాబ్ధాలుగా పని చేస్తున్న విజయ, ములకనూరు, నార్మూరు, కరీంనగర్ లాంటి స్థానిక పాల రైతుల సహకార సంఘాల ఉనికికు చేటు తెచ్చేలా గత ప్రభుత్వం గుజరాత్ అమూల్ కంపెనీ ఏర్పాటుకు ఈ ప్రాజెక్టు పరిధిలో ఇచ్చిన అనుమతిని కూడా రద్ధు చేయాలి.
ఫార్మా సిటీని రద్ధు చేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రకటన సిరా తడి ఆరకముందే , 1000 నుండీ మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో అనేక చోట్ల ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఫార్మా పరిశ్రమే కాలుష్య భరితమైనది. కాలుష్యం ఉండని ఫార్మా అంటూ ఉండదు. ఈ కారణం చేతనే అమెరికా, యూరప్ లాంటి ధనిక దేశాలు ఈ పరిశ్రమలను తమ భూ భాగం నుండీ తరిమేస్తున్నాయి. పైగా స్థానిక వైద్య అవసరాలకు కాకుండా, అంతర్జాతీయ ఎగుమతి కోసం చేసే ఇలాంటి మందుల పరిశ్రమలను మన రాష్ట్ర గ్రామాల మధ్యలో నెలకొల్పి , కాలుష్యాన్ని విస్తరించాలని అనుకోవడం సరైంది కాదు.
రాష్ట్ర హై కోర్టు భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించే నిర్ణయం కూడా ఆక్షేపనీయమే. ఎత్తయిన భవంతులు నిర్మించే అవకాశం ఉన్న రోజుల్లో సరైన భూమి వినియోగ విధానం లేకుండా ఒక్కో సంస్థకు వందల ఎకరాలు కేటాయించడం సరైంది కాదు. పైగా ఇందు కోసం వ్యవసాయ విశ్వ విద్యాలయం లోని ముప్పై ఎకరాలకు పైగా బయో డైవర్సిటీ బ్లాక్ నుంచీ భూమిని కేటాయిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వం ఆలోచిస్తున్న రాష్ట్ర కొత్త అభివృద్ధి నమూనాలో అర్బన్ (ఔటర్ రింగ్ రోడ్డు లోపు ), సెమీ అర్బన్ (రీజనల్ రింగ్ రోడ్డు లోపు ), రూరల్ ( రీజనల్ రింగ్ రోడ్డు నుండీ రాష్ట్ర సరిహద్దులోపు) క్లస్టర్స్ గా విభజించి , పారిశ్రామికీకరణ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నమూనా లో వ్యవసాయ , పారిశ్రామిక, సేవా రంగాలకు తగిన స్థానం ఉండాలి.
కానీ ఈ కొత్త అభివృద్ధి నమూనా రూపొందించే ముందు లోతైన చర్చ జరగాలి. పారిశ్రామికీకరణ పేరుతో ,ఆయా జిల్లాలు, మండలాలు ,గ్రామాలలో గత 50 ఏళ్లుగా జరిగిన భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన పై ప్రభుత్వం స్పష్టమైన శ్వేత పత్రం ప్రకటించాలి.
వివిధ జిల్లాలలో ఆయా పారిశ్రామిక వాడలకు, గతంలో కేటాయించిన భూములను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా, కొత్త భూ సేకరణకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ లు ఇవ్వకూడదు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటయ్యే పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా చూడడం, ఈ సంస్థలు స్థానిక యువతీ యువకులకే 80 శాతం ఉద్యోగాలు,ఉపాధి కల్పించేలా నిబంధనలు పెట్టడం, ఆయా పరిశ్రమలు, సంస్థలు నియమించుకునే కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలు సహా, ఇతర చట్టబద్ధ హక్కులు అందించేలా చూడడానికి, కార్మిక శాఖను బలోపేతం చేయడం అవసరం.
ఈ ముందస్తు హెచ్చరిక ఎందుకంటే, కేంద్రం తీసుకు వచ్చిన ఇథనాల్ 20 పాలసీ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 15 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. ఈ పరిశ్రమల స్థాపనలో స్థానిక ప్రజలకు ఆయా కంపనీల ప్రతినిధులు, జిల్లా అధికారులు నిజాలు చెప్పకుండా ,మోసం చేస్తున్నారు.
ఇప్పటికే నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం చిత్తనూరు లో ఏర్పాటయిన ఇథనాల్ పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించి, అత్యంత కాలుష్యాన్ని వెదజల్లుతున్నది. ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించింది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక ప్రజలపై ఇప్పటి ప్రభుత్వం కూడా 60 మందిపై హత్యా ప్రయత్నం లాంటి సెక్షన్ లతో కేసులు పెట్టింది. చిత్తనూర్ ,దిలావర్ పూర్ ప్రజలపై ఈ కేసులను ఎత్తేయడంతో పాటు, స్థానిక ప్రజల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలలో ఇథనాల్ పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్ధు చేయాలి.
నిజాం సుగర్స్ కంపెనీని పునరుద్ధరించడానికి చర్చలు ప్రారంభించడంతో పాటు, పత్తి, మొక్క జొన్న, సోయా, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు,పాలు, మాంసం లాంటి వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థానిక రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే, కాలుష్యం లేని పరిశ్రమలు అందుబాటు లోకి వచ్చి స్థానిక యువతకు , ఉపాధి కల్పిస్తాయి.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పారిశ్రామికీకరణ విధానం లోనే ముందుకు సాగకుండా, కొత్త అడుగులు వేయాలి. పరిశ్రమల కోసం భూ సేకరణ నుండీ, కాలుష్యం సృష్టించని పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వరకూ, మొత్తంగా అత్యంత పారదర్శకంగా, ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్ళాలి.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, కాలుష్య రహిత పరిశ్రమలు, స్థానిక ముడి సరుకుల ఉత్పత్తిదారులకు లాభదాయకత, పారిశ్రామిక కార్మికులకు చట్టబద్ధ హక్కుల అమలు, లక్ష్యంగా పెట్టుకుని TS I PASS చట్టంలో అవసరమైన మార్పులు చేయాలి. సేవా రంగంలో వచ్చే పరిశ్రమల లో కూడా స్థానిక యువత ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన శిక్షణలు అందించడం వేగంగా జరగాలి.
రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా, సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించక పోగా, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల, రెండేళ్లుగా వ్యవసాయ శాఖ కనీసం సంవత్సర ప్రణాళిక కూడా తయారు చేసి ప్రకటించలేని దుస్థితిలో ఉంది. అందువల్ల నూటికి 60 మందికి జీవనోపాధి కల్పించే వ్యవసాయ రంగం కోసం సమగ్ర విధాన రూప కల్పన చేయడం పై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలి.
ప్రతి సర్వే నంబర్ లో వాస్తవ సాగుదారుల గుర్తింపు కోసం ప్రతి సంవత్సరం జమాబందీ, రాష్ట్ర అవసరాలకు అనుగుణమైన పంటల ప్రణాళిక, గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పెట్టుబడులు, రైతులకు న్యాయమైన ధరలు అందేలా , పంటల కొనుగోలు విధానం, ప్రకృతి వైపరీత్యాల నుండీ రైతులు తట్టుకునేలా పంటల బీమా పథకం, వ్యవసాయ విద్య, పరిశోధనా సంస్థలకు జీవం పోయడం – ఇవన్నీ ఈ విధానంలో భాగంగా ఉండాలి.
మరో నాలుగు నెలలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే లోపు ఈ చర్చలన్నీ ముగిసి, కార్యాచరణ రూపొందాలి. నగరాల కాలుష్యానికి తోడు , గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంలో వినియోగిస్తున్న విష రసాయనాలు సృష్టిస్తున్న విధ్వంసం నుండీ రాష్ట్రాన్ని బయట పడేయడానికి ఈ సంవత్సర ఖరీఫ్ ప్రారంభంలోనే సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. అయిదేళ్లలో రాష్ట్రమంతా సేంద్రీయ వ్యవసాయ విధానం వైపు వెళ్ళేలా, రైతులకు శిక్షణలు ఇవ్వడంతో పాటు, ప్రభుత్వం పెట్టుబడులు కూడా పెట్టాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయానికి,రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఈ మేరకు నిర్ధిష్ట బాధ్యతలు ఇవ్వాలి.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని , ప్రభుత్వం ప్రకటించిన మద్యం బెల్టు షాపుల రద్ధు నిర్ణయాన్ని వేగంగా అమలు లోకి తేవడానికి స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులతో, మహిళా బృందాలతో కమిటీలు వేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ ద్వారా ఈ విధానం ఫలితాలను విశ్లేషించాలి.