- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ అభివృద్ధే మా ఎజెండా అని,మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణం నాంపల్లి 5వ,6వ తిప్పపూర్ 7వ, 8వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు వేములవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తిప్పపూర్ బ్రిడ్జి, రాజన్న ఆలయ అభివృద్ధి వంటి కీలక పనులను కూడా చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హామీలు ఇస్తారని, గెలిచాక ప్రజలను మరిచిపోతారని అన్నారు. తిప్పపూర్‌లో మూలవాగు బ్యూటిఫికేషన్‌కు రూ.86 లక్షలు నిధులు విడుదల చేశామని, లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతామని అన్నారు. తిప్పపూర్ బస్ స్టాండ్ వేములవాడకు ముక్కు లాంటిదని, గత ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నిస్తే తానే అడ్డుకున్నానని,ప్రస్తుతం రూ.1 కోటి 60 లక్షలతో బస్ స్టాండ్‌ను ఆధునీకరిస్తున్నామని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని,కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. వేములవాడలో సొంత స్థలం లేని సుమారు 2000 మంది పేదలకు అడుగు స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు, ఉచిత సన్నం బియ్యం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. సన్నం బియ్యం పంపిణీ తెలంగాణలో మాత్రమే జరుగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోందని, ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు
