అండగా ఉంటామని భరోసా
బలగం టీవీ, తాడేపల్లి:
పల్నాడు జిల్లా రెంటచింతల పర్యటన సందర్భంగా ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన చీలి సింగయ్య కుటుంబం ఈరోజు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. సింగయ్య భార్య లూర్ధు మేరి, ఆమె కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిసి తమ బాధను వెళ్లడించారు.
సింగయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన వై.యస్. జగన్, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీలి సింగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, సింగయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఈ భేటీ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ కూడా వై.యస్. జగన్‌ను కలిశారు.
