లేబర్ కోడ్‌లపై పోరాటం ఉధృతం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం..!

0
63
  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

బలగం టీవీ, హైదరాబాద్‍:

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలంగాణ భవన్‌లో కార్మిక సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో (Round Table Meeting) కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్‌లపై (New Labour Codes) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ చర్చ అర్థవంతంగా జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్‍ మాట్లాడుతూ.. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్ వర్ధంతి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆ మహనీయుడు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించాం. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారు, అలాగే అత్యంత పేదరికం ఉంది. ‘ప్రపంచమే కుగ్రామం’ అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారు. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనని అన్నారు. ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో 3500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారు. కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారని తెలిపారు.

నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకురాబట్టే ఫలితాలు సాధించింది. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదు. అన్నింటికీ మందు… పోరాడే పార్టీకి పార్లమెంట్‌లో తగిన సీట్లు ఇవ్వడమేనని అన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయని అన్నారు.

మోనోపలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ (Indigo Airlines) వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని, శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగింది. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్ పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయని అన్నారు.

కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుంది. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్‌టీయూ (BRTU) పనిచేసినా అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, బీఆర్‌టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుంది. సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదామని, ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుస్తామని కేటీఆర్ ప్రకటించారు. లేబర్ కోడ్‌ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here