బీసీలకు ప్రభుత్వం అన్యాయం..

0
47
  • బిసి డిక్లరేషన్ ను తుంగలో తొక్కిన ప్రభుత్వం
  • సాయి ఈశ్వర చారి కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి..

‌ – బీఆర్‍ఎస్‍ నేత కంచర్ల రవి గౌడ్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న అన్యాయ వైఖరిపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‍ఎస్‍ నేత కంచర్ల రవి గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిరసనగా ఆత్మహత్యకు పాల్పడిన బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారి మరణానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీలు కేవలం మాయమాటలేనని, ఇది ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనమని రవి గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానిని కేవలం 17%కి కుదించడం ద్వారా ప్రభుత్వం బీసీ వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఘటనపై నోరు విప్పకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీసీ వర్గాలు అభివృద్ధి పథంలో నడిచాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కింది అని రవి గౌడ్ అన్నారు. సాయి ఈశ్వర చారి ఆత్మహత్యకు కారణమైన ఈ ప్రభుత్వంపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిందేనని రవి గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించబోదని ఆయన హెచ్చరించారు. సాయి ఈశ్వర చారి కుటుంబానికి కనీసం ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని రవి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వడ్లురి వేణు, అరెల్లి వినయ్, ద్యావనపెల్లి సందీప్, అలుగునురి వినాయక్, శ్రీకాంత్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here