బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రను గ్రామ స్థాయి నుండి పార్లమెంటు వరకు జరిగిన ప్రతి ఘట్టాన్ని పూర్తిస్థాయిలో రికార్డు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా. వాసరవేణి పరశురాం పేర్కొన్నారు.
బుధవారం సిరిసిల్లలో సామాజిక సేవకుడు మరియు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న “సిలుముల జయవర్థన్” పై రచించిన కరపత్రాన్ని ఆయన తల్లి సిలుముల నాగమల్లవ్వ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. వాసరవేణి పరశురాం మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రను తాను రచిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరూ ఏకమై పోరాడటం గర్వకారణమని అన్నారు. కవులు, రచయితలు, మేధావులు తెలంగాణ ఉద్యమ చరిత్రను నవలలు, కథలు, వ్యాసాల రూపంలో రాస్తున్నప్పటికీ ఇంకా మారుమూల గ్రామాల వరకు జరిగిన ప్రజా ఉద్యమాన్ని సమగ్రంగా లిఖితం చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిలుముల నాగమల్లవ్వ, డా. వాసరవేణి పరశురాం, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు, సిలుముల జయవర్థన్, నగునూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
