శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌ సహా ప్రజా ప్రతినిధులకు సత్కారం..

0
47

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, నెహ్రూ నగర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తమను మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులను దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానించడం పట్ల దేవాలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి సాక్షిగా సత్కరించడం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.

బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల తరఫున గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఒకే వేదికపై ఉన్నారని పేర్కొంటూ, పార్టీలకతీతంగా స్వామివారి ఆశీస్సులతో సిరిసిల్ల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) సహకారంతో అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మాట్లాడుతూ.. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. గతంలో కేటీఆర్ సహకారంతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ, దేవాలయ విశిష్టతను కొనియాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు ఆడెపు శ్రీహరి మరియు కార్యవర్గ సభ్యులు, పుర ప్రముఖులు నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం అధ్యక్షులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్, వేద పండితులు, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం చక్రపాణి కి, మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు పద్మశాలి సంఘం అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here