- హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు
- లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం (ట్రస్ట్) ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్తా మందిర ద్వితీయ కుంబాభిషేక రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘స్థాపిత ప్రతిష్ట మూర్తులకు మూల మంత్రములచే హోమం’ కార్యక్రమంలో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి – చక్రపాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో, కనుల పండుగగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న దేవస్థానం ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ హోమంలో పాల్గొనడం తమ అదృష్టమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి వారి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
పూజా కార్యక్రమాల అనంతరం మదనానంద పీఠాధిపతులు శ్రీ శ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు సదానంద మాధవార సరస్వతి స్వామి వారు భక్తులకు హితబోధ చేస్తూ అందించిన ప్రవచనాలను చైర్‌పర్సన్ దంపతులు మరియు భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలకించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి, కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్యామల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గడ్డం చందన భగవాన్, గుడిపాటి చంద్రశేఖర శర్మ గురుస్వామి, ఇతర గురుస్వాములు, పుర ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

