ఎస్పీ మహేష్ బి. గితే
బలగం టివి, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, విధి నిర్వహణలో వారి త్యాగాలు మరువలేనివని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకల్లో ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా పాల్గొని,ఈ సందర్భంగా హోంగార్డ్ సిబ్బంది నిర్వహించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటు నిరంతరం సేవలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో కలిసి పనిచేస్తూ, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. హోంగార్డు అధికారులు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విధి నిర్వహణలో ప్రతి హోంగార్డు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని, వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ఎస్పీ మహేష్ బి. గితే ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, మొగిలి, నాగేశ్వరరావు, రవి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
