బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- రైతులతో కలిసి రాయిని చెరువు పరిశీలన
– బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టి 9వ ప్యాకేజి పనులను పూర్తి చేయకుండా 11వ ప్యాకేజీకు నిధులను తీసుకపోయిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9వ ప్యాకేజీ పనులను పూర్తిచేసే వరకు పోరాటం ఆగదని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలో 9వ ప్యాకేజీ పనులు పూర్తికాక ఎండిపోయిన రాయిని చెరువును రైతులు, నాయకులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయిని చెరువు ఎండిపోవడంతో ఆయకట్టు యాసంగి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకునే షాడో సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్కసారి ఎండిపోయిన రాయిని చెరువును సందర్శించాలన్నారు. రైతులకు సాగునీరు అందించి దాహార్తి తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టలేదని మా నీళ్లను సిద్దిపేటకు తరలించేందుకే ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రాజెక్టులు ఉపయోగపడడం లేదన్నారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి రాయిని చెరువుకు రావలసిన పైప్లైన్ పనులను కంచర్ల అటవీ ప్రాంతంలో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలోనే పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేదని, రాయిని చెరువు భూములు మీ నాయకులకు సంబంధించినవని పనులను ఆపారా అని ఎమ్మెల్యే కేటీఆర్ కు సవాల్ విసిరారు. రాయిని చెరువు నింపితే మండలంలోని అన్ని గ్రామాల్లో పంట పొలాలు సస్యశ్యామలమవుతాయన్నారు. పిసిసి అధ్యక్ష హోదాలో ఎల్లారెడ్డిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి 9వ ప్యాకేజి పనులు పూర్తి చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద ఐదు నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 9వ ప్యాకేజీ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు లక్పతి నాయక్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిట్ల నాగరాజు, ఎల్లారెడ్డిపేట మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు లక్ష్మీరాజం, దాసరి గణేష్, సందేవేని రాజు, సిరిసిల్ల వంశీ, లింబాద్రి, వెంకటేష్, శ్రీనివాస్, పిర్యా, మోహన్, తదితరులు పాల్గొన్నారు