రాజన్న ఆశీస్సులతో ముందుకు సాగుతున్న ఆలయ విస్తరణ..

0
54

– రాజన్న ఆలయ అభివృద్ధికి భారీ నిధులు

– తుది దశలో మేడారం గద్దెల పునర్నిర్మాణ పనులు

– భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వ చర్యలు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తూ భారీ నిధులు మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క ఆలయానికి రాగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా కోడె మొక్కు చెల్లించుకొని, భీమేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రి మాతను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వామి వారి ప్రసాదం అందజేసి, వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. అనంతరంవేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు రూ.కోటి నిధులతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తుల విశ్వాసాలు, నమ్మకాలకు అనుగుణంగా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు రెండు బడ్జెట్లలో కలిపి రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని, పూర్తి అయిన అనంతరం సీఎం స్వయంగా దర్శనానికి వస్తారని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ వివిధ శాఖల నుంచి నిధులు తీసుకువస్తున్నారని, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి వేగం పెరిగిందని అన్నారు.అలాగే మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణానికి రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని, వందల ఏళ్ల చరిత్ర నిలిచేలా నిర్మాణాలు చేపడుతున్నామని .,మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని అన్నారు.మహిళా సంఘాల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతుందని, మండలాల్లోనూ భవనాల నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నామనిఅన్నారు. . మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు వంటి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.కోటి మంది మహిళలను కోటి ఈశ్వరులుగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రూ.2 లక్షల రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం : ఆది శ్రీనివాస్

వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలో వందల కోట్ల రూపాయలతో రోడ్లు, జంక్షన్లు, సుందరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నమని అన్నారు.ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు, రోడ్డు వెడల్పుకు రూ.47 కోట్లు, సుందరీకరణకు రూ.2.65 కోట్లు, జంక్షన్ల అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టం : గరిమ అగ్రవాల్

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం అదృష్టమని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. తిప్పాపూర్ జంక్షన్‌ను శివుడి థీమ్‌తో అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్డీఓ రాధాభాయ్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here