ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్నరు..

0
85

బాలు విగ్రహం : ముఖ్యమంత్రినే అడగాలి

  • కందుకూరి రమేష్ బాబు

బలగం టీవీ, హైదరాబాద్‍:

నిజానికి ఇది ప్రభుత్వానికి ఉండవలసిన కన్సర్న్. బాలు విగ్రహం స్థాపన గురించి విస్పష్టంగా ‘నో’ చెప్పవలసినది రాష్ట ప్రభుత్వమే. ఆ బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే.

స్వరాష్టాన్ని తెలంగాణ ప్రజ పోరాడి సాధించుకున్నది కేవలం ‘స్వయం పాలన’ కోసమే కాదు, అది కేవలం ‘భౌగోళిక తెలంగాణ’ ఏర్పాటు కోసమే కాదు. ప్రత్యేక రాష్ట సాధనా పోరాటం అన్నది రాజకీయ అధికారానికే కాదు, తెలంగాణ ఆట పాటలకు భూమికగా ఉంటూ మావైన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల, ఇక్కడి జీవన విలువల పునస్థాపన కోసం. అది పునర్నిర్మాణం కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఆత్మ గౌరవ పోరాటం.

మిలయన్ మార్చ్ అనేక విధాలా ఒక గొప్ప పాఠం. అది స్వరాష్ట్ర నిర్మాణంలో ‘వినిర్మాణం’ ఆవశ్యకతను చాటి చెప్పింది. కూలిన విగ్రహాలే అందుకు ప్రభల సాక్ష్యం. అక్కడి నుంచి, అప్పటి ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోని వారికి రవీంద్రభారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బలసుబ్రహణ్యం గారి విగ్రహ ప్రతిష్టాపన పట్ల వ్యక్తమవుతున్న నిరసన, ఆగ్రహం ఎన్నటికీ అర్థం కాదు. ఆ సమాజానికి అర్థం చేపించే సదవకాశం చేజేతులా చేజార్చినది గడిచిన పదేళ్ళ పాలనకు కారణమైన ప్రభుత్వం, ఒక్క మాటలో కేసీఆర్.

అది ఎంతమాత్రం దురదృష్టం కాదు, దుర్మార్గ పూరితం.

స్వీయ రాజకీయ అస్తిత్వం పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఇందుకు మొదటి దోషి. ఆయన రాగానే మాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి, పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని మెల్లమెల్లగా నీరుగార్చారు. అదే మలిదశ ఉద్యమానంతర రాష్ట సాధన మొదటి గడపలోనే ఎదురైన ఆరంభ అపజయం. తొలి బీజం. ఆ బీజం నేడు మొక్కై ఆ తర్వాత మానై కూచున్నది. ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్నది.

అవును. ఎంతమాత్రం తెలంగాణ సొయి లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పదేళ్ళు ఆచరించిన వైఖరి బాగా ఉపకరించింది. తెలంగాణ వాదానికి గానీ తెలంగాణా భావోద్వేగానికి గానీ, మీదు మిక్కిలి ఇక్కడి ఆత్మ గౌరవానికి గానీ ఏవిధంగా సంబంధం లేని నూతన ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇదే సుస్పష్టమవుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఆస్తిత్వాన్ని పెంచి పోషించగలిగే శక్తి గానీ, అదే సమయంలో సీమాంధ్రుల సాంస్కృతిక దాడిని, జోక్యాన్ని అనుమతించనీయని దృక్పథం గానీ ముఖ్యంగా స్వరాష్ట్రానికి అవశ్యమైన ‘పొలిటికల్ విల్’ గానీ లేదు. ఆ కారణంగా తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల్లో తాజాగా ‘బాలు’ ‘ప్రైవేట్’ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇవ్వడం ఒకటి.

ఇది రెండు రాష్టాల ప్రజల సమస్య కానే కాదు. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రతిభ గురించిన అంశమూ కాదు. ప్రజలకు అనేక సమస్యలుండగా వాటన్నిటిపై దృష్టి సారించే అవసరం ఉండగా దీన్ని ఒక కీలక అంశంగా ముందుకు తెచ్చారు. ఇక్కడి సమాజానికి చెందినదిగానూ మార్చి చోద్యం చూస్తున్నారు. దాన్ని నిరసించే కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు, ముఖ్యంగా ఉద్యమకారుల వైఖరిని, వాళ్ళ నిరసనలను ‘లేని పోని గొడవలు’గా భావించేలా మారుస్తున్నరు. ఇది ప్రజల సమస్య కానేకాదు, నిజానికి ప్రభుత్వానికి ఉండవలసిన కన్సర్న్. బాలు విగ్రహం స్థాపన గురించి విస్పష్టంగా ‘నో’ చెప్పవలసినది రాష్ట ప్రభుత్వమే. ఆ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే.

రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం జరూరుగా మేలుకోవాలి. తెలంగాణ స్వీయ అస్తిత్వానికి సంబంధం లేని ప్రతీకలు, విగ్రహాలు, పాలనా పరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలిగే వైఖరిని వారు ఇప్పటికైనా అవలంభించవలసిందే. రాజకీయ అవసరాలనే ముఖ్యంగా భావించిన గత ప్రభుత్వం ఎలా ప్రజలకు దూరమైందో కళ్ళ ముందున్న అనుభవం. ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోకపోతే కేసీఆర్ మాదిరే రేవంత్ రెడ్డి గారు కూడా మరొక దోషిగా తెలంగాణ సమాజంలో నిలబడక తప్పదని గ్రహించాలి.

బాలు విగ్రహం విషయంలో వాదోపవాదాలు అనవసరం. తక్షణం చైతన్యవంతమైన తెలంగాణ పౌర సమాజం ప్రశ్నించ వలసినది శుభలేక సుధాకర్ ని కాదు, ముఖ్యమంత్రిని. సాంస్కృతిక శాఖా మంత్రిని, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ని.

రవీంద్రభారతిలో బాలు విగ్రహం వద్దని చెబుతూ వెంటనే రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి తెలంగాణ విద్యావంతులు, బుద్ది జీవులు, కవులు, కళాకారులు, మేధావులు ఎక్కడికక్కడ ప్రకటనలు చేయడం, అలాగే సంయుక్తంగానూ ఒక ప్రకటన విడుదల చేయడం అత్యవసరం.

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖకు సలహా మండలి పేరుతో ఇరవైమందిని ప్రభుత్వం నియమించింది. లోపలినుంచి నిరసనగా వారంతా ‘వద్ద’ని ఒక ప్రకటన విడుదల చేయడం కూడా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here