- గాంధీ విగ్రహం పేరుతో 500 కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
- రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇళ్లు కూల్చడమే లక్ష్యమా?
- రైతు భరోసాపై కేబినెట్‌లో మాట లేదు.. భూముల పంపకాల్లోనే సీఎం, మంత్రుల ధ్యాస.
బలగం టీవీ, హైదరాబాద్:
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ మూసీ పరిసరాల్లో గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్‌లో 500 కుటుంబాలు, సుమారు 2500 మంది జనాభా నివసిస్తున్న ప్రాంతాన్ని రూ. 5 వేల కోట్ల వ్యయంతో గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం చెరబట్టాలనుకోవడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
“మా తాత పేరుతో ఇలాంటి పనులు చేయకండి, ఆయన బతికి ఉన్నా ఇలాంటి చర్యలను సమర్థించరు” అని గాంధీ మనవడు తుషార్ గాంధీ స్వయంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు ఇవ్వాల్సిన ‘రైతు భరోసా’ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కానీ పేదల భూములను లాక్కోవడంలో మాత్రం ప్రభుత్వం వేగంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఖమ్మం వెలుగుమట్లలో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లపైకి తెల్లవారుజామునే లాఠీలతో వెళ్లి కూల్చివేయడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి తెలంగాణ భూములను కేకు ముక్కల్లా పంచుకుంటున్నారని, ఇది ఒక ‘రియల్ ఎస్టేట్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు.
పేద, మధ్యతరగతి వర్గాలు జీవితకాలం కష్టపడి నిర్మించుకున్న ఆశల సౌధాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్న సర్కారు పెద్దల తీరును ప్రజలు గమనిస్తున్నారని, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.


