- యాడ్లలో తెలంగాణ రైసింగ్ .. హాస్పిటల్స్ లో విద్యార్థులు ఫాలింగ్..
- మెస్సితో ఫుట్ బాల్ ఆడేందుకు మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదు..
- కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థత.
- కింగ్ కోఠి ఆసుపత్రిలో పరామర్శించిన హరీష్ రావు.
బలగం టీవీ, బాగ్ లింగంపల్లి:
బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శలో ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు. అనంతరం హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్న ‘విజన్ 2047’ విద్యార్థుల పాలిట ‘పాయిజన్ 2047’ గా మారిందని అన్నారు. టీవీ, పేపర్ యాడ్లలో మాత్రమే తెలంగాణ రైసింగ్ అని చెబుతున్నారని, వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారంతో హాస్పిటల్స్ లో ఫాలింగ్ అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకులంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న షామీర్ పేటలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఏకంగా విద్యార్థులే పోలీస్ స్టేషన్ కి వెళ్లి రేవంత్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. నిన్న మాదాపూర్‌లోని చందు నాయక్ తండాలో 43 మంది, తాజాగా బాగ్ లింగంపల్లిలో 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నీకు నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు అని అన్నారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు వెళ్లమంటే భయపడుతున్నారని చెప్పారు, ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని అన్నారు.
కనీసం ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టైనా లేదని, ఏనాడు ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదని విమర్శించారు. ఒక పక్క పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడానికి డబ్బుల్లేవు కానీ, మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు రూ. 5 కోట్లతో స్టేడియం, రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. “ఆ డబ్బుతో విద్యార్థులకు ఒక పూట కడుపునిండా అన్నం పెట్టలేవా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో మంచి నాణ్యమైన ఆహారం అందేదని, కానీ ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారని, అన్నం ఉడకడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు, రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి, ఈరోజు ఫుట్ బాల్ చూడడానికి వస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో సమస్యలున్నా ముఖం చాటేసిన రాహుల్ గాంధీ, ఫుట్‌బాల్ చూడడానికి ప్రత్యేక విమానంలో వస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. 61 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా అని, ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మేదారి అన్న రాహుల్ గాంధీ, రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు, 160 మంది ఆటో డ్రైవర్లు, 116 మంది విద్యార్థులు చనిపోయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడవా రాహుల్ గాంధీ? అని ప్రశ్నిస్తూ, “గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత లేదా?” అని నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యాడని, త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదని ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండని హరీష్ రావు హెచ్చారించారు.



