- 163 BNSS (సెక్షన్ 144) కచ్చితంగా అమలు చేయాలి.
- కేంద్రాల వద్ద గుమికూడితే కఠిన చర్యలు.
- పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేత.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును సమీక్షించి, విధుల్లో ఉన్న అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు కచ్చితంగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు లేదా విద్యార్థుల తల్లిదండ్రులు గుంపులుగా ఉండకూడదని, పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ వెంట సిరిసిల్ల పట్టణ ఇన్‌స్పెక్టర్ కృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.


