కవలలను పెళ్లాడిన కవలలు!

0
100

బలగం టీవీ, కామారెడ్డి:

పెళ్లిళ్లలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం. కానీ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు కవల సోదరులు, ఇద్దరు కవల సోదరీమణులను వివాహం చేసుకుని ఒకే ఇంటికి కోడళ్లుగా ఆహ్వానించారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి సాయిలు – లక్ష్మి దంపతుల కుమారులు విజయ్, వినయ్ లు కవలలు. వీరికి వివాహం నిశ్చయించే క్రమంలో, అదే జిల్లాలోని దేమికలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి గంగాధర్ – గంగమణి దంపతుల కుమార్తెలు కీర్తన, కీర్తిలతో సంబంధం కుదిరింది. విశేషమేమిటంటే కీర్తన, కీర్తి కూడా కవలలే!

తమ పిల్లలు కవలలు కావడంతో, అవతలి వారు కూడా కవలలు దొరకడం అదృష్టంగా భావించిన ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను నిర్వహించాయి. ఒకే ముహూర్తాన, ఒకే వేదికపై ఈ జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

రూపురేఖల్లో ఒకేలా ఉండే వధూవరులను చూసి అతిథులు సైతం ఆశ్చర్యపోయారు. ఎవరు విజయ్? ఎవరు వినయ్? అలాగే ఎవరు కీర్తన? ఎవరు కీర్తి? అని గుర్తుపట్టడం పెళ్లికి వచ్చిన బంధువులకు కాస్త కష్టమైనా, ఈ అరుదైన వేడుకను చూసి అందరూ మురిసిపోయారు. ప్రస్తుతం ఈ “కవలల కల్యాణం” సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త జంటలను గ్రామస్తులు, బంధుమిత్రులు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here