పోక్సో కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష , ఎస్పీ మహేష్ బి. గితే…

0
66

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన వేధింపుల కేసులో నిందితులకు కఠిన శిక్ష పడింది. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను 2021 సంవత్సరంలో ఆమెకు వరుసకు అన్న అయ్యే తూర్పటి ప్రవీణ్ అనే యువకుడు బలవంతపు వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో నిందితుడి తండ్రి తూర్పటి జానీ మరియు నానమ్మ పొచవ్వలు కలిసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేయగా, నాటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి లోతైన దర్యాప్తు జరిపి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరపున పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ తమ వాదనలు వినిపించగా, సి.ఎం.ఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నవీన్ మొత్తం 10 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్, నిందితుల నేరం రుజువు కావడంతో తూర్పటి జానీ మరియు తూర్పటి పొచవ్వలకు చెరో నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి 2000/- రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. కాగా, ప్రధాన నిందితుడు తూర్పటి ప్రవీణ్ ఘటన సమయంలో మైనర్ కావడంతో అతనిపై విచారణ ప్రస్తుతం జువెనైల్ కోర్టులో కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో నేరాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని, ఇటువంటి కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పీపీలు, సి.ఎం.ఎస్ సిబ్బంది, మరియు దర్యాప్తు అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here