బలగం టీవీ, హైదరాబాద్:
- పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్
- గులాబీ రంగు దుస్తులతో హాజరుకావాలని విజ్ఞప్తి
- సభా ప్రాంగణానికి చేరుకునేందుకు విస్తృత ఏర్పాట్లు
వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదలిరావాలని సూచించారు.
పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రణాళిక వేసుకోవాలని కోరారు.
పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలను కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని కోరారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజన వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని తెలిపారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, నేరుగా వారికి సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని మాత్రమే వాహనాలను నిలపాలని సూచించారు.
అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీటి బాటిళ్లతోపాటు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు.
చారిత్రక సభలో కేసిఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
