పాలిస్టర్ యజమానుల నిర్లక్ష్యానికి నిరసనగా వార్పిన్ కార్మికుల ధర్నా..

0
70

బలగం టీవీ,  రాజన్నసిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిస్టర్ యజమానుల సంఘం వద్ద వార్పిన్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పాలిస్టర్ పరిశ్రమ యజమానులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పాలిస్టర్ వార్పిన్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు ము శం రమేష్ మాట్లాడుతూ, బతుకమ్మ చీరల తయారీ సమయంలో ఉన్న పనిభారం కంటే ఇప్పుడు రెండింతలు పెరిగినా, వేతనం మాత్రం పెంచడానికి యజమానులు ముందుకు రావడం లేదని విమర్శించారు. కార్మికుల కూలీ రేట్లు నిర్ణయించాల్సిన అధికారులు యజమానులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

జోలి శాఖ అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, బట్టలు ఉత్పత్తి చేసే కార్మికులతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేరని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పథకం యజమానుల పథకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులు కేవలం తమ లాభాల గురించే ఆలోచిస్తున్నారని, కార్మికులకు మెరుగైన వేతనం ఇవ్వాలనే ఆలోచన వారికి లేదని ఆయన దుయ్యబట్టారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పవర్లూమ్ కార్మికులకు న్యాయమైన వేతనం నిర్ణయించి సమస్యను పరిష్కరించాలని రమేష్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ ధర్నాను విజయవంతం చేయడానికి ఉదయం 9 గంటలకు బి వై నగర్‌లోని సిఐటియు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, యూనియన్ అధ్యక్షులు సిరిమల్లె సత్యం, వైపన్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, ఉడుత రవి, మచ్చ వేణు, వై పని జిల్లా నాయకులు ఒగ్గు గణేష్, ఎలికేటి శ్రీనివాస్, ఐరన్ ప్రవీణ్, బూట్ల వెంకటేశ్వర్లు, దోమల రమేష్, చింత కింది సుధన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here