బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- ఆరు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం
- ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
తిప్పాపూర్ నుంచి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండో వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జి నిర్మాణానికి రూ 6 కోట్ల 85 లక్షల వ్యయంతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మర్రిపెల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, లచ్చపేట రిజర్వాయర్, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో భారీగా నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని అన్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలా ఆలయ విస్తరణ చేపడుతున్నమని,మే నెలలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర శేఖరశర్మ వేములవాడ కు రానున్నారని,ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి వారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని, భూసేకరణ చట్టం ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం అన్నారు. దుకాణాలు పూర్తిగా కోల్పోతున్న వారికి మధ్య మార్గం ద్వారా ప్రత్యామ్నాయం చూస్తున్నామని,రైల్వే లైన్లో భూమి పోతున్న వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు.
రూ.80 లక్షలతో మార్కెట్ సముదాయం..
వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో రూ.80 లక్షలతో అన్నీ ఒకే రకంగా కూరగాయల సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఉపయోగపడేలా, సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేయిస్తామని అన్నారు. నిత్యం తాను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటునన్నారు. కోనరావుపేట మండల పరిధిలో త్వరలోనే పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపడతామని, వేములవాడ పట్టణంలో గంగమ్మ దేవాలయానికి ఒక నడిచిపోయేట్రాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు తమ ఫ్లాట్లను క్రమబద్దికరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించిందని,అర్హులైన వారందరూ తప్పకుండా వినియోగించుకోవాలని,తద్వారా 25 శాతం రాయితీ కల్పిస్తారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని అన్నారు.

విప్ ప్రత్యేక శ్రద్ధతోనే..
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడలో దాదాపు 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతోనే పనులు ప్రారంభమయ్యాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఆయా శాఖ మంత్రులను ఒప్పించి బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. భూసేకరణ ఇతర పనులను రెండు నెలల్లో పూర్తి చేసిన వేములవాడ ఏ ఆర్డీవో, తహసిల్దార్, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖ, నీటిపారుదల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డి ఈ శాంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.