మాలల అస్థిత్వం కోసం పోరాడుతాం..

0
39

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం..

  • మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్

బలగం టీవీ, హన్మకొండ:

ఎస్సీ వర్గీకరణ కారణంగా గత పది నెలలుగా మాల సామాజిక వర్గం, విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని మాల సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. హన్మకొండలో మాల సంఘాల జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో వరంగల్ జిల్లా అడ్హక్ (Adhoc) కమిటీని ఏకగ్రీవంగా నియమించారు.

ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తెలంగాణలో మాల సామాజిక వర్గానికి రాజకీయంగా, సామాజికంగా నష్టం చేకూర్చిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ, భవిష్యత్తులో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం, నాయకులు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన పార్ట్ టైమ్ లెక్చరర్ల నోటిఫికేషన్‌లో రోస్టర్ పాయింట్ల అమలులో జరిగిన అవకతవకలను వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ వర్గీకరణ వల్ల యూనివర్సిటీ స్థాయిలోనే మాల విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నాయకులు బండి అశోక్, దండు మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కర్రే సదాశివ్, జెట్టి రాజేందర్, బండి రజినిష్, దండ్రి శ్రీనివాస్, గుండు రాజేష్, సంతోష్, బత్తుల రమేష్, బత్తుల దిలీప్ మరియు కాకతీయ యూనివర్సిటీ మాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here