- బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ముశం రమేష్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఠాగూర్ సౌదేకర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు గత ఆరు నెలలుగా చెల్లించాల్సిన వేతనాలను వెంటనే అందించాలని బీడీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని యూనియన్ జిల్లా అధ్యక్షులు ముశం రమేష్ హెచ్చరించారు.
ఈరోజు బీవై నగర్ అమృత లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ, ఠాగూర్ సౌదేకర్ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులకు నెలనెలా వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. దీనివల్ల కార్మికులు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వేతనాల చెల్లింపుతో పాటు, కంపెనీ సెంటర్ల అద్దెలను కూడా కార్మికుల కూలీల నుండి వసూలు చేయడం శ్రమ దోపిడీ అని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలను బీడీ యాజమాన్యం తక్షణమే నిలిపివేయాలని, వెంటనే కార్మికులకు రావలసిన ఆరు నెలల వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని రమేష్ డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే, హైదరాబాద్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీడీ జిల్లా నాయకులు సూరం పద్మ, శ్రీరాముల రమేష్ చంద్ర, జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
