– శివాజీ ఆలోచనలు యువతకు మార్గదర్శకం
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ అర్బన్ మండలం, రూరల్ మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. అర్బన్ మండలం ఆరపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణ పరిధిలోని అయ్యోరుపల్లి, రూరల్ మండలం జయవరం గ్రామాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు . అణిచివేతకు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా శివాజీ మహారాజ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ధర్మం కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని, ఈ తరం యువత ఆయన చరిత్రను తెలుసుకుని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శివాజీ అందరివాడని, ఆయనను ఏ ఒక్క వర్గానికే పరిమితం చేయడం సరికాదని అన్నారు .
ఆరపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం జరగడం శుభపరిణామమని, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన వ్యక్తికి చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరపల్లి గ్రామంలోని పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంకెపల్లి గ్రామంలో గెజిట్ సమస్యను పరిష్కరిస్తామని,మసిపూసి మారేడు కాయ చేయడం నాతో కాదు అని, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఇప్పటికే మాట్లాడినని,వాటికి త్వరలోనే శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసిన మని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

