సర్పంచులను వేధిస్తే ఊరుకోం.. ప్రతి జిల్లాలో ‘లీగల్ సెల్’ ఏర్పాటు…

0
363
  • కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు.. న్యాయపరంగా అండగా ఉంటాం
  • రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
  • సిరిసిల్లలో నూతన సర్పంచులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బిఆర్‌ఎస్ గెలుపొందిన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని (Legal Cell) ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, విజేతలను అభినందిస్తూ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

సర్పంచుల కోసం లీగల్ సెల్ ఏర్పాటు: కేటీఆర్ భరోసా.

సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బిఆర్‌ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది,” అని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ద్వారా తమ హక్కుల కోసం పోరాడదామని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత.

కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బిఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా ప్రజలు, బిఆర్‌ఎస్ నేతలు నిలబడ్డారని, అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీని గెలిపించారని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తికి, వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు.

పదవి ముఖ్యం కాదు.. పనే ముఖ్యం.

సర్పంచులు పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. సూర్యాపేట జిల్లాలోని ‘ఏపూర్’ గ్రామం చెక్ డ్యాంలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిన విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు.

శిక్షణా తరగతులు త్వరలో.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రికార్డు అభివృద్ధి.

దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకోవడం కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదని అన్నారు. తాగునీటి సరఫరా, పరిశుభ్రత నిర్వహణ, పచ్చదనం వంటి అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here