బలగం టీవీ, రంగారెడ్డి :
-TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
పవిత్రమైన జర్నలిజం వృత్తిని నాశనం చేస్తున్న కలుపు మొక్కల్లాంటి నకిలీలను ఏరివేసి, వృత్తికి పూర్వ వైభవం తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు.

మంగళవారం నాడు శంకర్ పల్లి మండల పరిధిలో గల ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన యూనియన్ రంగారెడ్డి జిల్లా మహాసభకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిజం పట్ల ఎలాంటి అవగాహన లేని కొన్ని శక్తులు టీవీ లోగోలను, ప్రభుత్వ గుర్తింపు లేని పత్రికలను సృష్టించుకొని, జర్నలిస్టులుగా చెలామణి అవుతూ, బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతూ పబ్బం గడుపుతూ వృత్తి పవిత్రతను, గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి శక్తుల కదలికలపై ఇప్పటికే తమ సంఘం కన్నేసి పెట్టిందని, వారిని పట్టుకొని చట్టపరంగా తగిన శిక్ష విధించేందుకు పగడ్బంది చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. విలువలు, ఐక్యత, పోరాటాలు, త్యాగాల కలయికతో డెబ్భై ఏండ్ల క్రితం ఆవిర్భవించిన తమ సంఘం ఆ స్ఫూర్తితోనే నేటివరకు పనిచేస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం అవిశ్రాంతంగా లెక్కలేనన్ని పోరాటాలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. తాము ఏ పార్టీకో, ఏ ప్రభుత్వానికో వత్తాసు పలికేది లేదని, జర్నలిస్టుల సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమన్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టు మల్లెపూల నరేందర్ పోలీసుల-నక్సలైట్ల యుద్ధంలో చిక్కుకొని, వారి కాల్పుల్లో మృతి చెందిన ఘటనపై, రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ నేతల భూభాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు గులాం రసూల్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంఘటనపై, మెదక్ లో జర్నలిస్టు యాదగిరిని కల్లు మాఫీయా హత్య చేసిన సంఘటనపై, నల్లగొండ జిల్లా ఆలేరులో జర్నలిస్టు శ్రీధర్ రెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపిన ఘటనపై దేశ స్థాయిలో పోరాటాలు చేసి, ప్రభ్యత్వాల మెడలు వంచి, విచారణలు జరిపించి నిందితులకు సరైన బుద్ధి చెప్పిన ఘనత తమ సంఘానికే దక్కిందని విరాహత్ అలీ స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై జరిగిన ఎన్నో దాడులను పోరాటాలతో ఎదుర్కొన్న చరిత్ర తమకు ఉందన్నారు. ముఖ్యంగా యాజమాన్యాల దృష్టిలో అంటరాని వాళ్లుగా పరిగణించబడిన గ్రామీణ ప్రాంత విలేఖరులకు అక్రెడిటేషన్లు సాధించి, వారికి వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తింపు కల్పించిన ఘనత తమ సంఘానిదేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మరిన్ని రాజీలేని పోరాటాలు చేస్తామని విరాహత్ అలీ భరోసా ఇచ్చారు.

ఈ మహాసభలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు, మన తెలంగాణ పత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్, బిఆర్ఎస్ పార్టీరంగారెడ్డి జిల్లా నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు కె.శ్రీకాంత్ రెడ్డి, జి.మధు గౌడ్, రాష్ట్ర కోశాధికారి యం.వెంకట్ రెడ్డిలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 450 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.