బలగం టీవీ, హైదరాబాద్ :
-కార్మిక సంఘం జాతీయ నాయకులు ప్రసాద్
కార్పొరేట్ కబంద హస్తాల్లోకి వెళ్లిన మీడియాను, వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రక్షించుకోడానికి ఉదృతంగా జర్నలిస్టు సంఘాలు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కార్మిక సంఘ జాతీయ నాయకులు పి. ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ అధ్యక్షతన ‘జర్నలిజం- వృత్తి సంఘం’ అనే అంశంపై, 33 జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ, సామాజిక స్పృహ కలిగిన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి ఎంతో ఉద్యమ చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో వస్తున్న మార్పులపై జర్నలిస్ట్ సంఘం వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మునుముందు జిల్లా, మండల స్థాయిలో సైతం జర్నలిస్టులను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా మీడియా పూర్తిగా బడా కార్పోరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అక్షర జ్ఞానాన్ని అందించి వేతనాలు పొందిన జర్నలిస్టులు తదనంతరం వార్తలు పంపి టిప్స్ పొందే పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు యాజమాన్యాలు విధించే టార్గెట్స్ కనుగుణంగా యాజమాన్యాలకే జర్నలిస్టులు డబ్బులు ఇచ్చే దుస్థితి ఏర్పడిందన్నారు. యాజమాన్యాల టార్గెట్లతో మండల, డివిజన్ స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు బెదిరిపోతున్నారని పేర్కొన్నారు. దీంతో సమాజంలో జర్నలిస్టుల పట్ల చులకన భావం ఏర్పడుతుందన్నారు. విధి నిర్వహణలో సామాజిక స్పృహతో ముందుకు వెళుతూ పరాయికరణ నుండి బయట పడాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజంలో మళ్లీ పాత్రికేయుల పాత్ర కీలకమైన పరిస్థితులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని జర్నలిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని, ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆయన సూచించారు.


మారుతున్న చట్టాలతో జాగ్రత్త..
– కె.శ్రీనివాస్ రెడ్డి
మారుతున్న చట్టాలతో ప్రతి జర్నలిస్టు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమించి జర్నలిస్టుల సంక్షేమం కోసం సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 44 చట్టాలు ఉండగా 29 చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్ లుగా తెచ్చిందన్నారు. కొత్త చట్టాలు అన్నీ కూడా వేల కోట్ల పెట్టుబడిదారుల యజమానులకు అనుకూలంగా తయారు చేసినవేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న కొత్త చట్టాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో సంఘ కార్యకలాపాలను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే మానవీయంగా ఆలోచించి ఖండించాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉంటుందన్నారు. సంఘ ప్రయోజనం, ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు. సంఘ బాధ్యుల పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ స్వాగతం పలకగా, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, నగునూరి శేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కె.రాములు, ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, బి.సంపత్, గాడిపల్లి మధు, రాష్ట్ర కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
బి.కిరణ్, ఏ.రాజేష్, రాజేశ్వరి, డి.జి.శర్మ, ఎలగందుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
