ఫెర్టిలైజర్ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలి…

0
42
  • ప్రతి షాప్ వద్ద హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉండాలి.
  • ఆయిల్ పామ్ లక్ష్యం చేరుకోవాలి.
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
  • వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సమీక్ష.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:


రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఫెర్టిలైజర్ యాప్ పై అవగాహన, ఆయిల్ పామ్ లక్ష్యం తదితర అంశాలపై జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సమీక్ష సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకునేలా చూడాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఫెర్టిలైజర్ యాప్ వివరాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, అలాగే హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, పీఏసీఎస్ లలో ఎరువుల విక్రయాలు, నిలువ, ఎంత స్టాక్ ఉందో రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఆయిల్ పామ్ లక్ష్యం చేరుకోవాలి.

వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులను కలిసి ఆయిల్ పామ్ సాగుతో లాభాలను వివరించాలని, సబ్సిడీలు, ప్రోత్సహకాలు, పంట ఉత్పత్తులకు మద్దతు ధర, అందుబాటులో ఫ్యాక్టరీ ఉందని విషయాలు తెలుపాలని, సాగుతో లాభాలు తెలియజేసి సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. పలువురు వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలు ఆయిల్ పామ్ పెంపునకు కృషి చేస్తుండడంతో వారిని అభినందించారు. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులకు జిల్లాలో ఇప్పటికే పంట ఉత్పత్తులు వచ్చిన రైతుల క్షేత్రాలు చూపించాలని, అలాగే సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్ట గ్రామంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి.

వేములవాడ, నాంపల్లి, గంభీరావుపేట, అల్మాస్పూర్, సనుగుల, ఇల్లంతకుంట పీఏసీఎస్ లు ఎఫ్ పీ ఓ లకు ఎంపిక కాగా, ఆయా పీఏసీఎస్ ల బాధ్యులను అభినందించారు. రైతులకు ఉత్తమ సేవలు అందిస్తూ.. వ్యాపారంలోనూ వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here