మహిళా సమాఖ్య భవనాలను త్వరితగతిన నిర్మించాలి..

0
24

– భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి

  • కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్వాడీలు, గ్రామపంచాయతీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు తుది దశలో ఉన్న నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, 15 ఆర్థిక సంఘం నిధులు, ఎన్ హెచ్ ఎం, డీఎంఎఫ్టీ వంటి ఇతర నిధులతో మహిళా సమాఖ్య, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీల నిర్మాణాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో నిర్మాణ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాలకు మంజూరు చేసిన మహిళా సమాఖ్య భవనాల పనులను మూడు రోజుల్లో ప్రారంభించాలని, ఇప్పటికే ప్రారంభించిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, తుది దశలో ఉన్న గ్రామపంచాయతీ, అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేసి, వాటిలో నీటి, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అయితే, ఇంకా ప్రారంభించని పనులపై మండల ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలను పరిష్కరించి, త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని  ఆదేశించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని ఏపీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఏఈలతో సమావేశం ఏర్పాటు చేసి, మంజూరైన నిర్మాణాలు, వాటి ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి పై సమగ్ర సమాచారం పొందాలని సూచించారు.

పంచాయతీరాజ్ శాఖ ఈఈ, డీఆర్డీఓ, డీడబ్ల్యూఓ, డీఈఓ అధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరపాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం డస్ట్ బిన్, హ్యాండ్ వాష్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో పారిశుధ్య పనులను పక్కాగా చేపట్టాలని సూచించారు.

ఈ సభలో డీఆర్డీఓ గీత, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, ఎంపీడీవోలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here