“కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి” – సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ పిలుపు..

0
41

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజీవ్‌నగర్‌లోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ ఆధ్వర్యంలో గురువారం రోజున కార్మికుల కోసం గ్రూప్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పున్నం చందర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో కార్మికులు తమ పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందన్నారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాట్లు, సరైన విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిరంతర ఒత్తిడి, ఆర్థిక భారం, కుటుంబ బాధ్యతలు వంటి అంశాలు మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చెప్పారు. అలసట, నిద్రలేమి, చిరాకు, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు.

కార్మికులకు ముఖ్య సూచనలు..
  • సమతుల్య ఆహారం తీసుకోవడం
  • రోజూ కనీసం 7–8 గంటల నిద్రపోవడం
  • మద్యపానం, పొగ త్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం
  • నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవడం
  • యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం
  • పని సమయంలో భద్రతా నియమాలు పాటించడం

యజమానులు కూడా తమ సంస్థల్లో ఆరోగ్య శిబిరాలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించి కార్మికుల శారీరక–మానసిక ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన కార్మికులు ఉంటేనే కుటుంబం, సంస్థ మరియు సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదాన్ని గుర్తుంచుకుని ప్రతి కార్మికుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న థ్రిఫ్ట్ పథకం, నేతన్న బీమా, ప్రధానమంత్రి జీవిత సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన వంటి పథకాల్లో చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ, హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మూషం రాజయ్య, రవీందర్ కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here