బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
అతివేగం ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. తంగళ్ళపల్లి మండల పరిధిలోని మండేపల్లి గ్రామ శివారులో జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన మీసా అజయ్ (21), తన స్నేహితుడు ఎలగందుల శివమణితో కలిసి సోమవారం రాత్రి కేసీఆర్ నగర్ నుంచి సిరిసిల్లకు తన యాక్టివా స్కూటర్ (TG 23 A 1499) పై బయలుదేరారు. మార్గమధ్యలో మండేపల్లి శివారులోని రాముని గుట్ట సమీపంలోకి రాగానే, అజయ్ తన వాహనాన్ని అతివేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి స్కూటర్ స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ మీసా అజయ్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న శివమణి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పోందుతున్న బాధితుడి బంధువు జక్కని త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
