బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
– నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా పక్కా కార్యాచరణ అమలు చేయాలి..
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా స్థాయి స్కిల్ కమిటీ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా 16 మంది సభ్యులతో జిల్లా స్థాయి స్కిల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేందుకు అవసరమైన నైపుణ్యత, శిక్షణ అందించేందుకు జిల్లా స్థాయి స్కిల్ కమిటీ పని చేస్తుందని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20% జనాభా తయారీ, సర్వీస్ సెక్టార్ లో ఉపాధి పొందుతున్నారని,చిన్న పరిశ్రమల స్థాపన, స్టార్ట్ అప్ కల్చర్, స్టాండప్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియా వంటి వాటి పై అవగాహన కల్పన కార్యక్రమాలను జిల్లా స్థాయి స్కిల్ కమిటీ ద్వారా చేపట్టాలని తెలిపారు.
ఉపాధి అవకాశాలు సృష్టించేలా యువతను తయారు చేయాలని అన్నారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కేంద్ర ప్రభుత్వ రంగం,ఆర్మీ, బ్యాంకు రిక్రూట్మెంట్ సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు యువతకు తెలియజేస్తూ వారు ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన శిక్షణ అందించేందుకు కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయం, మున్సిపల్ భవనంలో ఆర్మీ నేవీ సంబంధించి ఉద్యోగాల భర్తీ వివరాలు నోటీసు బోర్డు లలో ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో ఎలక్ట్రీషియన్ కొరత కూడా ఉందని, ఈ రంగంలో కూడా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి న్యాక్ ద్వారా శిక్షణ అందించాలని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా గార్డెనింగ్, హార్టికల్చర్ లో శిక్షణ అందించాలని అన్నారు. దేశంలోనే పెద్ద కంపెనీల యొక్క ప్రస్తుత డిమాండ్ ప్రకారం మన యువతకు నైపుణ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
టీ వర్క్స్ తో సమన్వయం చేసుకుంటూ యువతకు అవసరమైన అవకాశాలు అందులో చూడాలని కలెక్టర్ తెలిపారు. టాటా వంటి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వర్క్ షాప్ లను ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రధానమంత్రి సూర్య రష్మీ యోజన పథకం స్వశక్తి మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, వీరికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సోలార్ ప్యానల్స్ తయారి డిజైన్ వంటి వివిధ రకాల అవకాశాలను యువతకు అందేలా చూడాలని అన్నారు
ఈ సమావేశంలో జిల్లా ఉపాది కల్పనాధికారి రాఘవేందర్, డి.ఆర్. డి.ఓ. శేషాద్రి, జీ.ఎం. డి.ఐ.సి. హన్మంతు, డి.ఏ.ఓ. అఫ్జలి బేగం, ఎల్.డి.ఎం మల్లికార్జున్ , ఎస్టి , బి.సి సంక్షేమ అధికారులు, జనార్దన్, రాజమనోహర్, లేబర్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.